Article

సుబ్బయ్య గారి హోటల్ రుచి మరియు ఆప్యాయత కి ఆదరాభిమానాలు

September 11 2018

0

303

మొన్న హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు KPHB కాలనీలో  కాకినాడ సుబ్బయ్య గారు హోటల్ ఓపెనింగ్ అయ్యిందని అందరికీ తెలిసిందే కదా... అయితే మా పేజీలో ఉన్న కొందరు హైదరాబాద్ వాసీయులు (ఉద్యోగం కోసం ఆంధ్రా జిల్లాల నుండి వచ్చిన వారు) అడుగుతున్నారు ఏంటండీ ఈ మధ్య అందరూ అదే మాట్లాడుకుంటున్నారు అస్సలేంటీ అంత ఫేమస్సా అని... సరే అండి ఎందుకంత ఫేమస్సో చెప్తాను ఓపికుంటే చదవండి... నచ్చితే ఓ పదిమందికి షేర్ చేయండి 

అసలు సుబ్బయ్య హోటల్ లో తినడానికి ఆకలికంటే ముందు ధైర్యం ఉండాలి.. అన్ని వెరైటీస్ ఉంటాయి మరి..

మన ధైర్యాన్ని సవాల్ చేస్తూ, ఆకులో ముందు స్వీట్ వడ్డించి దాడి చెయ్యడం మొదలుపెడతారు... చాలా బావుంటుంది ఒకసారి రుచి చూడండి అంటారు వడ్డించేవాళ్ళు.

అన్నీ రుచి చూడండి, బూరెల్లో నెయ్యి వేసుకోండి చాలా బావుంటుంది అని సలహా కూడా ఇచ్చేస్తారు సర్వర్లు..

కడుపు లో అస్సలు ఖాళీలేదు అని చెప్పినా సరే, లాస్ట్ లో ఒక గ్లాస్ తో మజ్జిగ ఇచ్చి ఇది తాగండి చలవ చేస్తుంది అని అభిమానంగా చెప్తుంటే కాదనాలనిపించదు..

నిజమేనండి ఒక్క సారి మా కాకినాడ రండి వాళ్ళు ఇలా ఆప్యాయంగా వడ్డించారు అని మీకనిపించకపోతే  నా పేజీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తా... 

అంత ధృడంగా ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా... 
నిజానికి ..తినండీ తినండీ అని ఏ హోటల్ లోనూ ఎవరూ అనరు. కానీ సుబ్బయ్యహోటల్ లో అలా కాదు అప్యాయంగా వడ్డించాలనే నియమానికి కట్టుబడి ఉండడంసుబ్బయ్య కాలం నుండీ అలవాటైన సంస్కారం అంతే..

వడ్డించే ప్రతి వారు, వడ్డిస్తూ ఈ ఐటెం ట్రై చేయండి చాలా బావుంటుంది అంటుంటే వీళ్ళెందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనే ప్రశ్న మొదలై బిల్ తోపాటు భారీ టిప్ కూడా ఇవ్వాలా అని అనిపిస్తే….
వద్దు అస్సలు ఇలాంటి ఆలోచన అక్కరలేదు ,మీరు సర్వర్ చేతికి టిప్ ఇస్తుంటే అయ్యో వద్దండీ మీరు భోజనం చేసారు అదే సంతోషం అనేస్తారు వాళ్ళు..

ఒక్కసారి సుబ్బయ్య హోటల్ లో తింటే ఎప్పటికీ ఆ టేస్ట్ ని,ఆ ఆప్యాయతని మర్చిపోలేరు..అంత ఫేమస్ సుబ్బయ్య హోటల్ . 

=== === === INTERVEL === === ===
ఇప్పటి వరకు వారి మర్యాదల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఐటమ్స్ లోకి వెళదాం 

ఎన్టీ రామారావుగారైతే అప్పట్లో తూగోజీ ఎప్పుడొచ్చినా ఇక్కడ భోజనం చెయ్యకుండా వెళ్ళీవోరు కాదని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు..

రైల్వే గేట్ దాటుతున్న గూడ్సుబండి బోగీల్లాగా ఎంతకీ తరగని ఐటమ్స్ అన్నీ సర్వర్ కుర్రోళ్ళ చేతుల్లోంచి ఒకదానెనకాల ఒకటి వస్తానే ఉంటాయి..

అన్నిటికంటే ముందు మజ్జిగావడలో బూందీ పలుకులు చల్లి మీ ముందెడతారు.. మీరు చేతిలోకందుకుని దాంతో మొదలెడతారు.. కళ్ళు మూసుకుని తింటా ఉండగానే పులిహోర, ఫ్రైడ్రైసు, చపాతీ ఒకదానెనకాలొకటి రెండు రకాల కూరలు, చట్నీలు, పచ్చళ్ళతో సహా మీ అరిటాకు ప్లేటులో ప్రత్యక్షమైపోతాయ్..

కాకినాడలో సుబ్బయ్య హోటల్ అంటే గోదారోళ్ళే ఆ హోటల్ పెట్టారనుకుంటున్నారేమో,

కాదు.. కాదు నెల్లూరు కి చెందిన ‘గునుపూడి సుబ్బారావు’ గారు కాకినాడ వచ్చి ,అద్దె ఇల్లు తీసుకుని ,చక్కగా పీటలు వేసి అరిటాకుల్లో భోజనాలు పెట్టి అప్యాయం గా కొసరి కొసరి వడ్డించి చుట్టుపక్కల ఊళ్ళలో మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆగండాగండి.. అది ట్రైలరంతే.. ఇప్పుడసలు సినిమా స్టార్టవ్వుద్ది..

పొగలు కక్కుతున్న తెల్లన్నాన్ని బేసిన్లతో పట్టుకొచ్చిన పెద్ద సర్వరు స్టార్ హోటళ్లలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్లాగా వయ్యారంగా చేతులు విదల్చకుండా, స్టీలు హస్తంతో తీసి ఒకే ఊపుతో హస్తంతో సహా అన్నాన్ని మొత్తాన్ని ఆకులోకి ఒంపుతాడు.. అదీ పద్దతంటే..పెట్టే మనసేంటో అక్కడ తెలుస్తాది.. 👌

"కరేపాకు పొడి సార్, కందిపొడి సార్, నెయ్యి సార్, ఇది దోసవకాయ టేస్ట్ చెయ్యండి.." అని పేరుతో సహా చెప్పి మరీ ఆప్యాయంగా వడ్డింతారు అన్నంలోకి పొడులు, పచ్చళ్ళు.. "ఇది బీట్రూట్ పచ్చడి.. ఆరోగ్యం" అని సలహాలిచ్చి ఒక చెమ్చాడు ఆకులో ఏసిగాని ముందుకి కదలడు ఇంకో ఎర్రరంగు బనేలు కుర్రోడు..

క్యారెట్-కొబ్బరి, దొండకాయ ఫ్రైల్లో ఏది కలుపుకోవాలో తెలీక మామిడికాయ పప్పు మీదకి మనసు లాగుతుంటే స్టక్కయిపోతాం మనం.. ఈలోగా గుళ్లో ఉండే దేవుడి విగ్రహాల్ని చేతి వెళ్ళకే ఉంగరాలుగా పెట్టుకున్న ఓ నల్లటి పెద్దమనిషి మనదగ్గరికొచ్చి "ఇది ఈరోజు స్పెషల్ ఐటమ్ సార్.." అన్జెప్పి మసాలా కూరి, జీడిపప్పు చల్లిన గుత్తివంకాయని ఆకు చివర్న నింపాదిగా పెడతాడు.. ఆ పెద్దమనిషే ఆ హోటలు ఓనరని మనకి అర్ధమయ్యిలోపులోనే ఆ గుత్తివంకాయ మన నోట్లో కమ్మగా కరిగిపోయి, అరిగిపోద్ది.. ఆటోమేటిగ్గా, మన సిస్టం కూడా హెవీ అయిపోద్ది... అలాగని ఏదీ వొదిలెయ్యడానికి మనసొప్పదు.. దేని రుచి దానిదే అన్నట్టు పోటీ పడతుంటాయ్..

రైస్ సార్ అని మరోసారి బేసిన్తో రెడీ అయిపోతాడు ఇందాకటి కుర్రోడు..

ఇంకెక్కడేట్టుకోమంటావ్ అని గుడ్లురిమి "పెరుగు పట్రా" అంటాంగానీ, "పెరుగా.. అప్పుడే.. ఇంకా సాంబారుంది, ఉలవచారుంది, మజ్జిగపులుసుంది.." అని ఆ కుర్రోడు మళ్ళీ లిస్టు చదివేసరికి కళ్ళు బైర్లు కమ్మి కడుపట్టుకుంటాం.. ఇక మనవల్ల కాదన్నట్టు సప్లయర్ వొంక జూత్తాం గానీ ఆళ్ళు వొదిలితే కదా..

ఎర్రమట్టి దాకలో తోడెట్టిన పెరుగుబిళ్ళ తీసి "సుబ్బయ్యగారి పేరుగండీ" అని వొడ్డింతారు.. పన్లోపని బట్టర్ మిల్కు కూడానండోయ్.. దాంతోపాటే ఆరోజు ఏ స్పెషలుంటే ఆ స్పెషలు స్వీటు, కిళ్లీ కూడా కామననుకోండి..

ఇలా "పెట్టి పెట్టి సంపేత్తార్రా బాబూ" అంజెప్పడానికి కాకినాడ సుబ్బయ్యగారి హోటేలనండీ ఉదాహరణ..

ఈళ్ళు పెట్టే క్వాంటిటీ సరే గానీ క్వాలిటీ మాట ఏంటంటారా.. ?

ఇత్తడి గుండిగలో వొండిన అన్నం ఒంటికి వేడి జెయ్యకుండా నోటికి కమ్మగా ఉంటాదని నమ్మిన సుబ్బయ్యగారి కాలంనించీ ఉన్న నమ్మకాన్ని, క్వాలిటీని ఆయన పోయాకా కూడా అలాగే మైంటైన్ చేసుకుంటా వస్తన్నారు సుబయ్యగారి కొడుకులు కూడానూ..

ఇత్తడి గుండిగల్లో వొండిన అన్నం వార్చేసాక తెల్లగుడ్డకప్పి తేమనంతా లాగేసి పొడిపొడిగా ఉండేలా జేస్తారు.. కొబ్బరాకులు మీద పులిహోర కలుపుతారు.. బూరెలకి, గారెలకి మినప్పిండిని రుబ్బురోల్లో రుబ్బితే మసాలాలనేమో రోట్లో దంచుతారు.. 
ఈటికి ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టి మరీ ఇలాంటి పద్ధతులు, పరికరాల మీదే జేయిస్తారు తప్ప మిషన్లమీద ఆధారపడటం తక్కువంటారు తెల్సినోళ్లు.. ఎంతవరకూ నిజమో మరి..

ఈమధ్యకాలంలో ఈ ముగ్గురన్నదమ్ములు ఎవరికీ వాళ్ళు విడిపోయి సొంతంగా పక్కపక్కనే ఇంకో రెండు రెస్టారెంట్లు పెట్టుకున్నాకా క్వాలిటీ తగ్గిపోయి, ఏదో పాతకాలం బ్రాండింగ్తో నడిపించేస్తన్నారని అక్కడక్కడా ఇనబడద్ది గానండీ, ఎప్పుడో 1940లో గునుపూడి సుబ్బయ్యగారు పెట్టిన హోటల్కున్న మంచి పేరైతే ఈళ్ళెవరూ చెడగొట్టలేదనే అందరి అభిప్రాయం..

హమ్మయ్య చైవే సరికి అలుపొచిన్చడా అండి 
...

మరింకేంటి ఆలస్యం హైదరాబాద్ లో మిత్రులారా 
దగ్గర్లో ఉన్నోళ్లు వీలైతే ఓసారెళ్లి తినొచ్చి చెప్పండి ఎలా ఉంది యవ్వారం ఏంటి అనేది.. "ఓసోస్ ఈమాత్రం దానికి కాకినాడదాకా రావాలేంటి, ఈ మాత్రం ఐటెమ్స్, టేస్టు మా దగ్గర ఉన్న వేరే హోటళ్లలో కూడా దొరుకుతాయి" అని మీరనొచ్చుగానండీ ఓపక్క ప్రేమని కలిపి వొండే వంటా, ఇంకోపక్క ఆప్యాయంగా బంధువుకి తినిపించినట్టు చేసే వడ్డన, ఈళ్ళు జేసే మర్యాద మాత్రం ఇంకెక్కడా నేను చూళ్ళేదండీ..

Share With :

Leave a Comment

  • Contact Us
  •     MIG 295, Sridevi Residency,
  •        Rd No : 4, KPHB Colony,
  •        Kukatpally, Hyderabad,
  •     + 91 9010 888 842
  •    info@subbayyagarihotel.com
  • Find Us

Copyright@SubbayyaGariHotel